Andhra Pradesh Latest Weather Updates బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం - బంగాళాఖాతంలో అల్పపీడనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 4:05 PM IST
Andhra Pradesh Latest Weather Updates: ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. ఇది క్రమంగా బలపడి అల్పపీడన ప్రాంతంగా మారే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల తేలిక పాటి నుంచి విస్తారంగా వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదే విధంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని తెలియజేసింది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు వేగంగా తిరోగమిస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబరు 15వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాల తిరోగమన ప్రక్రియ పూర్తి అవుతుందని ఐఎండీ తెలిపింది.