Andhra Pradesh Debt Details: రాష్ట్ర అప్పులను మరోసారి బయటపెట్టిన కేంద్రం - central govt about AP Debts
Andhra Pradesh Debt Details: రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ మరోసారి వివరాలు బయటపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకునే రుణాలను.. రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే.. పరిగణిస్తున్నట్లు కేంద్రం పునరుద్ఘాటించింది. ఏపీ ప్రభుత్వ అప్పులపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రెండేళ్లలో.. 70 వేల కోట్ల రూపాయలపైగా రుణాలకు గ్యారెంటీ ఇచ్చినట్లు రాష్ట్రం ప్రభుత్వం తెలిపిందని.. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2021-22లో 22 వేల 366 కోట్లు, 2022-23లో 57 వేల 449 కోట్ల రూపాయల రుణాలను.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్నాయని.. వివరించింది. మొత్తం 79 వేల 815 కోట్ల రూపాయల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తున్నట్లు పేర్కొంది. రుణాల మార్గదర్శకాలపై 2022 మార్చిలోనే రాష్ట్రానికి లేఖ రాశామని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. రుణాల గ్యారెంటీపై రాష్ట్ర ప్రభుత్వమే తమకు నివేదించిందని కేంద్రం పేర్కొంది.