Pattabhi on Jagan: 'జగన్‌ది రివర్స్ గేర్ ప్రభుత్వం.. అందుకే మూలధన వ్యయం తగ్గింది': పట్టాభి - TDP leader Pattabhiram news
TDP leader Pattabhiram fire on CM Jagan: జగన్ తన సొంత సంపద పెంచుకునే పనిలో పడి.. రాష్ట్ర సంపదను పెంచడాన్ని మర్చిపోయారని.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని దిగజార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగుకు చేరడంపై ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
23.1 శాతం మాత్రమే ఖర్చు చేశారు.. పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత తక్కువ మూలధన వ్యయం ఖర్చు చేసిన రాష్ట్రంగా నిలిచిందని.. బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొన్న విషయాన్ని ఆయన చదివి వినిపించారు. రాష్ట్రంలో మౌలిక వసతులపై చేయాల్సిన ఖర్చు ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు. బడ్జెట్‌లోనేమో రూ.29,917 కోట్లు క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్‌పై ఖర్చు చేస్తామని చెప్పి.. రూ. 6,917 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. అంటే.. కేవలం 23.1 శాతం మాత్రమే ఖర్చు చేశారని పట్టాభిరామ్ విమర్శించారు.
జగన్‌ది రివర్స్ గేర్ ప్రభుత్వం.. ''జగన్ ఆయన సొంత సంపద పెంచుకునే పనిలో పడి.. రాష్ట్ర సంపదను పెంచడాన్ని పూర్తిగా మర్చిపోయారు. గత నాలుగేళ్లలో మూలధన వ్యయంలో ఏపీ అట్టగున నిలవడమే దీనికి నిదర్శనం. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంపద సృష్టించడం ఎలాగో తెలుసు. జగన్‌కు సంపద ధ్వంసం చేయడం ఎలాగో తెలుసు. ప్రజావేదిక కూల్చడంతో వైఎస్సార్సీపీ పాలన ప్రారంభమైంది. రాష్ట్ర సంపద కాదు.. జగన్ సొంత సంపద పెంచుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులొస్తే మూలధన వ్యయం పెంచుతారు. కానీ, జగన్‌ది రివర్స్ గేర్ ప్రభుత్వం కదా.. మూలధన వ్యయం తగ్గించారు'' అని పట్టాభి వ్యాఖ్యానించారు.