Anantapur Range DIG Ammi Reddy: పుంగనూరు ఘటనలో అల్లరిమూకను విడిచిపెట్టేది లేదు: డీఐజీ అమ్మిరెడ్డి - Anantapur Range DIG Ammi Reddy
Anantapur Range DIG Ammi Reddy: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేసిన అల్లరి మూకలను విడిచి పెట్టబోమని అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మి రెడ్డి అన్నారు. చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో అనుమతి లేని మార్గంలో రావడంతో ఆందోళనకారులు రెచ్చి పోయి పోలీసులపై దాడులకు పాల్పడ్డారని చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులపై దాడులకు పాల్పడి అల్లర్లు సృష్టించిన వారిని వదిలిపెట్టమని వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన మార్గంలో కాకుండా అకస్మాత్తుగా పుంగనూరు పట్టణంలోకి ప్రవేశించిన అందోళనకారులు విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దాడులకు దిగి.. బారికేడ్లను తొలగించారని చెప్పారు. అల్లరి మూకలను అదుపు చేసే క్రమంలో స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలిపారు. నిరసనకారులు పెద్ద పెద్ద రాళ్లను పోలీసుల పైకి విసిరి... పోలీసు వాహనాలు ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారని చెప్పారు. సుమారు 2000 మంది అమానవీయంగా దాడి చేశారని, ముందస్తు ప్రణాళికలో బాగంగానే దాడులు జరిగాయని చెప్తూ.. మొత్తం 50 మంది పోలీసులు రాళ్ల దాడిలో గాయపడ్డారని తెలిపారు. వీరిలో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. దాడులకు సంబంధించి వీడియోల ద్వారా 40 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.