సాగు నీరు కోసం రైతుల ఆందోళన - పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలు - 42వ జాతీయ రహదారిపై అనంతపురం రైతుల నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 9:53 AM IST
Anantapur Farmers Protest on National Highway 42 : ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలకు కృష్ణా జలాలను అందించి, కాపాడకపోతే తాము ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం ఆ కాలువలో తుంగభద్ర జలాల ప్రవాహం అగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి హంద్రీనీవాలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను తరలించాలని కోరుతూ ఆయకట్టు రైతులు అనంతపురం జిల్లా విడపనకల్లులో భారీ ప్రదర్శన నిర్వహించారు.
Handri Neeva Irrigation Water Stop to Anantapur Crops :42వ జాతీయ రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని రైతులు ధర్నా చేపట్టారు. పచ్చగా ఉన్న వివిధ రకాల పంటల మొక్కలను ప్రదర్శించారు. అక్కడ ఏ అధికారి పట్టించుకోకపోవడంతో రైతులు ఒక్కసారిగా అక్కడి నుంచి బళ్లారి జాతీయ రహదారిపై దూసుకు వచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, తమ పంటలను కాపాడాలంటూ బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. రాస్తారోకోకు పోలీసు అధికారులు అభ్యంతరం చెప్పడంతో పలువురు రైతులు సీఐ ప్రవీణ్ కుమార్, విడపనకల్లు ఎస్ఐ కాళ్లు పట్టుకుని, దండాలు పెడుతూ వేడుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన ఉద్ధృతంగా మారింది.
Anantapur Farmers Agitation For Handri Neeva Irrigation Water :తహసీల్దార్ ఈరమ్మ రైతుల వద్దకు రాగా, ఆమె వాహనాన్ని రైతులు అడ్డుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చాలాసేపు జాతీయ రహదారిపై అలజడి నెలకొంది. రైతులు వెనక్కి తగ్గకుండా నినాదాలతో హోరెత్తించారు. తమకు పంటలను కాపాడడానికి 2016లో మాదిరి హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను తరలించాల్సిందేనంటూ పట్టుబడ్డారు. 20 రోజుల క్రితం తుంగభద్ర జలాలు అగిపోగా, అప్పటి నుంచి ఏమి చేస్తున్నారంటూ నిలదీశారు. అధికారులకు, రైతులకు మధ్య తీవ్ర వాదన చోటు చేసుకుంది. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి నీళ్లివ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీలు మద్దతు పలికాయి.