Somaravandlapalli project updates: సోమరవాండ్ల పల్లి ప్రాజెక్ట్ పనులు ఆపేసి.. సీఎం జగన్ రైతులను మోసం చేశారు: రైతులు
Raptadu Farmers fire on CM Jagan and YSRCP MLA: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, రాప్తాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై సోమరవాండ్ల పల్లి రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో రూ.806 కోట్ల రూపాయలతో ప్రారంభించిన.. పేరూరు జలాశయానికి కృష్ణా జలాలు తరలించే కాలువ నిర్మాణాన్ని, సోమరవాండ్ల పల్లి వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను నిలిపివేసి రైతుల జీవితాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్ట్‌కు రెండుసార్లు వర్చువల్ విధానంలో శంకుస్థాపన, భూమిపూజ చేసి ఇది చేస్తాం, అది చేస్తామంటూ నమ్మబలికి.. తమను దారుణంగా మోసం చేశారని వాపోతున్నారు.
ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం - రైతులను ఆదుకుంటాం.. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పేరూరు జలాశయానికి కృష్ణా జలాలు తరలించే కాలువ నిర్మాణంతోపాటు, సోమరవాండ్ల పల్లి వద్ద ప్రాజక్టు నిర్మించే పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.806 కోట్ల రూపాయలను కేటాయించి.. కాలువ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావటం, తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇంకెముంది ప్రాజెక్ట్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి.. రైతుల ఆశలు నిరాశలైయ్యాయి. కొద్ది రోజుల తర్వాత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని రైతులు ఆశ్రయించగా.. ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కొద్దీ రోజుల తర్వాత సీఎం జగన్.. రెండుసార్లు రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రాజెక్ట్‌కు భూమి పూజ చేసి గొప్పలు చెప్పారు. నాలుగేళ్లు పూర్తైనా ఇప్పటికీ పనులు మాత్రం జరగలేదు. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత రైతులతో కలిసి ప్రాజక్టు పనులను పరిశీలించారు. అనంతరం టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి, ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.