Pension troubles "కనికరించండి సారూ!".. ఆసరా పింఛన్ కోసం సబ్ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న వృద్ధుడు - పెనుగొండ సబ్ కలెక్టర్
Pension troubles: అర్హులైన ఎంతో మంది వృద్ధులు ఆసరా పింఛన్లకు నోచడం లేదు. అధికారులు కనికరిస్తే తప్ప పని జరగడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. పింఛన్ తీసుకునే వయస్సు ఉన్నప్పటికీ ఆధార్ కార్డుల్లో తక్కువగా నమోదు కావడంతో అడ్డంకులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. తమ సమస్యను ఎవరికి, ఎక్కడ విన్నవించుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని మణూరు గ్రామంలో ఆదివారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్ధుడు తనకు పింఛన్ అందడం లేదంటూ పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ కాళ్లు పట్టుకున్నాడు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చూస్తూ ఉండగానే ఇదంతా జరగ్గా.. పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధికారులు కరుణించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధాప్య పింఛన్ పొందడానికి అర్హత ఉన్నా ఆధార్ కార్డులో వయస్సు తక్కువ ఉండడం వల్ల మంజూరు చేయడం లేదని బాధిత వృద్ధుడు కలెక్టర్ వద్ద కన్నీరు పెట్టుకున్నాడు.