'ఇదేంది రాంబాబూ?' - లాటరీ కోసం పింఛన్దారుల సొమ్ము స్వాహా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 4:49 PM IST
Ambati Followers CollectingPensionersMoney to Sankranti Luckydip : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లాటరీ పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల నుంచి పెన్షన్ 3వేల రూపాయలకు పెరగ్గా అందులో నుంచి సంక్రాంతి సంబరాల లక్కీడిప్ టికెట్ పేరిట ఒక్కొక్కరి నుంచి వంద రూపాయల చొప్పున దండుకుంటున్నారు. లక్కీడిప్ టికెట్లు వద్దని పూర్తి నగదు ఇవ్వాలని కొందరు పెన్షనర్లు అడిగితే పింఛన్లు 3 వేలకు పెరిగాయి కదా, వంద రూపాయలు ఇవ్వలేరా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెలలో 40 వేల 615 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరి నుంచి వంద చొప్పున తీసుకుంటే 40 లక్షల 61 వేల వరకు వసూలవుతాయి. ఆ సొమ్మునే లాటరీ లక్కీడిప్ విజేతలకు బహుమతులుగా అందించేందుకు మంత్రి అంబటి అనుచరులు ప్రణాళిక వేశారు. జనం సొమ్ముతోనే లక్కీడిప్ విజేతలకు బహుమతులు అందించి, క్రెడిట్ కొట్టేసేలా అంబటి అనుచరులు ప్రణాళిక వేయడం విమర్శలకు తావిస్తోంది.