Allegations on YCP Leader: రహదారి పక్కనున్న స్థలంపై వైసీపీ నేత కన్ను.. ధర ఎక్కువగా ఉండటంతో - కడప తాడిపత్రి ప్రధాన రహదారి
Allegations on YCP Leader: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని కడప - తాడిపత్రి ప్రధాన రహదారికి అనుకుని ఉన్న స్థలంపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్నేశారు. స్థలం విలువ అధికంగా ఉండటంతో దానిని ఆక్రమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని తిప్పలూరు వద్ద పేర్ల శ్రీనివాసుల రెడ్డికి రెండున్నర సెంట్ల స్థలం ఉంది. సర్వే నంబర్ 194లో స్థలానికి సంబంధించిన రిజిస్టర్ పత్రాలు ఆయన పేరు మీదే ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ నేత అంబటి కృష్ణారెడ్డి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు శ్రీనివాసరెడ్డి, కుమారుడు సురేంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కక్షతో స్థలాన్ని సచివాలయంలోకి కలిపి చెట్లు నాటడానికి స్థలం కావాలంటూ వేధిస్తున్నాడని వాపోయారు. రహదారి పక్కనే స్థలం ఉండటంతో దాని విలువ ఎక్కువ ఉంటుందని.. అందుకే తమ స్థలాన్ని ఉద్దేశపూర్వకంగానే తన అధికార బలంతో బెదిరిస్తున్నారని తెలిపారు. అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.