"బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోంది"
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 2:55 PM IST
All Party Leaders Protest in Anantapur :పార్లమెంటుపై ఆగంతకులు చేసిన దాడి చేయడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని అఖిలపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు పార్లమెంటు ఉభయసభల నుంచి భారీగా విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ అనంతపురంలోని గాంధీ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు నిప్పులు చెరిగారు. ఇండియా కూటమి వర్ధిల్లాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పెద్ద నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని, ఈ తీరును ప్రజలు గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు.
MPs Suspended from Parliament : 'ఇండియా' కూటమితో దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిలపక్ష పార్టీల నేతలు తెలిపారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసి, దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.