AISB Leaders Protest: 'నాడు-నేడు పేరుతో రంగులు వేయడం కాదు.. మౌలిక వసతులు కల్పించాలి'
All India Student Block Leaders Protest: రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని.. ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు.. రకరకాల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సరికాదు అన్నారు. ప్రైవేటు సంస్థల్లో త్రినేత్రం చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా.. నేటికీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేయడం కాదని.. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంతో పాటు కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.