"నిరుద్యోగ సమస్య కారణంగా యువతకు పెళ్లి కావడం లేదు" - ఎఐవైఎఫ్
Tirumalai Raman Comments on Unemployment: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందారని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 70 లక్షల మంది యువత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి లేక అనేక కష్టాలు పడుతున్నారని.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఖాళీగా ఉంటే.. 10 లక్షలు మాత్రమే అవకాశాలు ఉన్నాయని యువతను పక్కదారి పట్టించేలా పార్లమెంట్లో ప్రకటన చేయడం సరికాదని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోవడంతో ఉపాధి లేక అల్లాడిపోతున్న యువతకు 15 వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు లేకపోవడం వలన యువత పెళ్లి వయసు కూడా మించి పోతోందని.. 40 ఏళ్లు వచ్చినా కొంత మందికి పెళ్లి కావడం లేదని అన్నారు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని తెలిపారు. దేశంలో సుమారు 5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని, మరో 5 కోట్ల మంది పాక్షికంగా మాత్రమే ఉపాధి పొందున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలలో యువతకు వయసు సడలింపు ఇవ్వాలని కోరారు. దేశంలోని వివిధ ప్రభుత్వ సంస్థలలో బ్యాంకింగ్ రంగం, రైల్వే రంగం లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు.