AISF Leaders Protest : 107, 108 జీవోలను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ధర్నా..
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 6:26 PM IST
AISF Leaders Protest : వైద్య విద్యా వ్యాపారానికి ద్వారాలు తెరుస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 107, 108లను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోశాధికారి సాయికుమార్ డిమాండ్ చేశారు. భాస్కరపురంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల పనులను పరిశీలించిన ఆనంతరం వైద్య కళాశాల ఎదుటే ఆందోళనకు సిద్దమవుతున్న తరుణంలో పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్ధి సంఘ నేతలు ధర్నా చౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అని చెప్పుకుని, వాళ్ల ఓట్లతో అధికారంలోకి వచ్చి నేడు ఆ వర్గాల వారికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ద్వారా వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను నేడు వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని అన్నారు. మూడు కేటగిరిలుగా సీట్లను భర్తీ చేసి వాటిలో 50 శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఆర్ కేటగిరీలకు కేటాయించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. 25 శాతం మాత్రమే రిజర్వేషన్ సీట్లను కేటాయించడం సరికాదన్నారు. మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బి కేటగిరి 402, సీ కేటగిరి 160 సీట్లు కల్పిస్తున్నారు. కానీ ఎస్సీ ,ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు 443 మార్కులు సాధించినా అవకాశం కల్పించడం లేదన్నారు. మెడికల్ సీట్ల కేటాయింపుతో ముఖ్యమంత్రి పేదల పక్షపాతి కాదు కార్పొరేట్ల పక్షపాతి అని ప్రజలకు అర్థమైందన్నారు. వెంటనే ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.