న్యాయం చేయకపోతే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాం : అగ్రిగోల్డ్ బాధితులు - ముఖ్యమంత్రి జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 3:35 PM IST
Agrigold Victims Dharma Porata Deeksha: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంక్రాంతిలోగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే ప్రతి ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో ఓడిస్తామని అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లు, ఖాతాదారులు హెచ్చరించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని వేలం వేసి తమకు చెల్లించాల్సిన 3వేల 81కోట్ల రూపాయలను వెంటనే ఇప్పించాలని బాధితులు కోరారు. 'నేను విన్నాను, నేను ఉన్నాను' అంటూ హామీలు ఇచ్చిన జగన్ ఎందుకు మాట తప్పారని నిలదీశారు. ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా అత్యుత్సాహం చూపించే సీఐడీ, అగ్రిగోల్డ్ వ్యవహారంలో ద్వంద్వ వైఖరి కనబరుస్తోందని మండిపడ్డారు.
అగ్రిగోల్ట్ బాధితులకు న్యాయం చేయాలంటూ విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో 30గంటల ధర్మపోరాట దీక్షలు ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకుని కొందరు, అనారోగ్యంతో మరికొందరు చనిపోతున్నా ప్రభుత్వానికి వారి వేదన ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. సీఎం జగన్కు ఏ మాత్రం కనికరం కలగట్లేదా అని ఏజెంట్లు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. ఈ దీక్షకు సీపీఐ, సీపీఎం నేతలు, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.