జిందాల్‌తో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒప్పందం - వ్యతిరేకిస్తున్న కార్మికులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 12:57 PM IST
Agreement With Jindal to Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్-3 ని పునర్ ప్రారంభించేందుకు జిందాల్‌తో ఒప్పందం చేసుకోవడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌లో కార్మిక సంఘాలతో సీఎండీ అతుల్ భట్ సమావేశమయ్యారు. 800 నుంచి 900 కోట్ల రూపాయల జీఎస్పీఎల్ పెట్టుబడికి అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా కేంద్రం ఒత్తిడి మేరకే జిందాల్‌తో ఒప్పందం చేసుకున్నారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎండీ సమావేశంలో కార్మికులు కిందనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
Workers Protest : జిందాల్‌తో చీకటి ఒప్పందానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెరతీసిందని ఓ కార్మికుడు ఆరోపించారు. దిల్లీ పెద్దల ఆజ్ఞలతో ఈ నెల16న ఆగమేఘాలతో జిందాల్‌తో ఒప్పందం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 19న జిందాల్‌తో ఒప్పందం చేసుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కనీసం స్టీల్ ప్లాంట్ కార్మికులతో సంప్రదింపులు జరపకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ ఒప్పందం కారణంగా కార్మికుడికి ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు.