Aeroplane on Road: లారీ ఎక్కిన విమానం.. చూసేందుకు ఎగబడిన జనం - లారీపై పాడైపోయిన పాత విమానం తరలింపు న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 5:26 PM IST
Aeroplane on Road: కర్నూలులోని జాతీయ రహదారిపై ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. నింగిలో ఎగరాల్సిన విమానం రివ్వున దిగి వచ్చి లారీ ఎక్కింది. ఫ్లైట్ లారీ ఎక్కడం ఏంటబ్బా అని అనుకుంటున్నారా..? నిజమేనండి బాబూ..! అయితే అది రన్నింగ్ కండీషన్లో ఉన్న విమానం కాదు.. పాడైపోయిన పాత విమానం. ఎయిర్ బస్ 320కి చెందిన ఈ విమానాన్ని దిల్లి నుంచి కర్నూలుకు లారీలో తీసుకుని వచ్చారు. లారీ పైకి ఎక్కి రోడ్డుపై పరుగులు తీస్తున్న ఫ్లైట్‌ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు సెల్ఫీలమీద సెల్ఫీలను తీసుకుంటూ మురిసిపోతున్నారు.
ఆ విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు దాన్ని తీసుకుని వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవల కాలంలో చాలా రకాల రెస్టారెంట్లు అందుబాటులో ఉండగా.. వినూత్నంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు. ఆరుగురు వ్యక్తులు భాగస్వాములుగా చేరి "కర్నూలు సిటీ ఆన్ వింగ్స్ బై మార్స్" అనే పేరుతో నగరంలో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విమానం కర్నూలు చేరుకోడానికి 15 రోజులు పట్టిందని నిర్వాహకులు అన్నారు. కర్నూలు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో.. రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఈ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రెస్టారెంట్‌ను జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దూపాడులో ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని యాజమాన్యం తెలిపింది.