చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పుపై హైకోర్టు న్యాయవాదులు ఏమన్నారంటే ? - Sunkara Rajendra Prasad
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 3:52 PM IST
Advocates on Supreme Court Verdict on Chandrababu Quash Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తెలిపారు. ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ (High Court Senior Advocate Sunkara Rajendra Prasad) తెలిపారు. సీజేఐ ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి నివేదించవచ్చని అభిప్రాయపడ్డారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముూర్తి నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ (Advocate Lakshmi Narayana) అన్నారు. అవసరమైతే ప్రత్యేక రాజ్యాంగ బెంచ్‌ని ఏర్పాటు చేసి సుదీర్ఘమైన తీర్పును వెలువరించే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ వివరించారు.
కాగా చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని జస్టిస్ అనిరుద్ధబోస్ పేర్కొన్నారు. కేసుల నమోదుకు ముందు సీఐడీ తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 17-ఎ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు. 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది పేర్కొన్నారు.