చందమామను అందుకున్నా - 'అక్కడ' బిడ్డను కనాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే! - డోలీ మోతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 1:28 PM IST
Adivasi and tribal women face difficulties during childbirth : చందమామపై అడుగు పెట్టడం దేశానికి గర్వకారణమే. కానీ, జనారణ్యంలో ఉంటున్న గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడున్నామో కూడా పాలకులు ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పటికీ ఎంతోమంది గిరిజనులు కనీస వసతులు లేక అల్లాడుతున్నారు. ఇక.. మహిళలు గర్భం దాల్చడానికే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పండంటి బిడ్డను కనాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. ప్రసవ సమయంలో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజన బిడ్డలు నరకయాతన అనుభవిస్తున్న దుస్థితి.
నాయకుల హామీలు నీటి మూటలు అవుతున్నాయి. ఆదివాసీలు, గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. వైద్యం కోసం మరోసారి పురిటి నొప్పులతో బాధ పడుతున్న నిండు గర్భిణి ని డోలీమోతలతో కష్టాలు పడుతూ సుమారు 4కిలో మీటర్ల దూరం కాలినడకన తరలించడం అందరినీ కలచి వేసింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ శివారు కొత్త లోసంగి గిరిజన గ్రామానికి చెందిన మరి శాంతి అనే 22 ఏళ్ల రెండో కాన్పు సంబంధించి గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలవడంతో లోసంగి నుంచి అర్ల తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఆటో లో బుచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి రోలుగుంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బాధిత గిరిజనులు మాట్లాడుతూ పాలకులు హామీలను అమలు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.