Acid Attack on woman: దారుణం.. ఎన్టీఆర్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి - నందిగామ మండలం ఐతవరంలో మహిళపై యాసిడ్ దాడి
Acid Attack on Woman In NTR District: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళపై ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కుమారుడు గాయపడ్డాడు. అంతేకాకుండా అడ్డుకోబోయిన బాధితురాలు అక్క కుతూరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన ఆకిపల్లి లక్ష్మీ తిరుపతమ్మ అనే మహిళ భర్త మరణించటంతో పుట్టినింట్లో ఉంటోంది. ఆమెకు నెల్లూరుకు చెందిన మణిసింగ్ అనే ఆటో డ్రైవర్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అతనికి టీబీ వ్యాధి రావటంతో లక్ష్మీ తిరుపతమ్మ తల్లిదండ్రులు వివాహనికి అంగీకరించలేదు. వివాహం కోసం ఇతర సంబంధాలు వెతకసాగారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మణిసింగ్ లక్ష్మీ తిరుపతమ్మ ఇంటికి వచ్చాడు.
రాత్రి సమయంలో వారి ఇంటి దగ్గరే నిద్రించిన అతను.. ఆదివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో వెంట తెచ్చుకున్న యాసిడ్‌తో లక్ష్మీ తిరుపతమ్మపై దాడిచేసి పారిపోయాడు. దీంతో ఆమె ముఖం, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె కుమారుడిపై కూడా యాసిడ్ పడటంతో అతనికీ గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోబోయిన బాధితురాలి అక్క కుతూరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాసిడ్‌దాడికి పాల్పడిన వ్యక్తిని నందిగామ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.