Achennaidu complaint on Minister Sidiri టీడీపీ వాళ్ల ఓట్లు తొలగించేలా వ్యవహరించండన్న మంత్రి సీదిరిపై అచ్చెన్నాయుడు ఫిర్యాదు..
Achchennaidu complaint on Minister Sidiri Appala Raju : ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక, పాడి, మత్స్య శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్నప్పటికీ.. ప్రతిపక్ష పార్టీల ఓట్లను, సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఫామ్-7 ద్వారా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని అచ్చెన్నాయుడు లేఖలో ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20.50 లక్షల ఓట్లను తొలగించారని వివరించారు. ఏ కారణంతో ఓట్లు తొలగించారో..? ఆ వివరాలను వివరిస్తూ ఓ జాబితా ఇవ్వాలని కోరారు. మంత్రి అప్పలరాజుపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. సత్వరమే చర్యలు తీసుకోవాలని అచ్చెనాయుడు డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?..శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఇటీవలే ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ''మనోళ్లందరికీ (వైసీపీ) ఇక్కడ ఓట్లు ఉంటాయి. మనవి అనుకుంటే ఓకే. మనవి కాదనుకుంటే (జస్ట్ రైజ్ ఏన్ అబ్జెక్షన్) అభ్యంతరం వ్యక్తం చేయండి. ఫారం-7 దాఖలు చేయండి. మన ఓట్లు కాదంటే మనకు వేసేవి కావు. అవి ప్రతిపక్ష నాయకుల బంధువులు, అనుచరులవి. వారు పిలిస్తే వస్తారు.. మనం పిలిస్తే రారు. కాబట్టి అలాంటి వారిపట్ల అభ్యంతరం వ్యక్తం చేయండి.'' అని అప్పలరాజు వ్యాఖ్యానించారు.