Acb Raids in Nellore : నెల్లూరులోని ప్రసిద్ధ ఆలయంలో ఏసీబీ తనిఖీలు.. భారీగా అక్రమాలు! - నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో ఏసీబీ సోదాలు
Acb Raid In Nellore Ranganathaswamy Temple: నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ గత రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు జరపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆలయ నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదులు రావడంతోనే సోదాలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. ప్రసాదాలు తయారీలో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఆలయ డిపాజిట్లకు సంబంధించిన లెక్కలు కూడా ఖాతా పుస్తకాల్లో గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. స్వామివారి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇతర వివరాలు గురించి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆలయానికి సంబంధించి 15 కేజీల బంగారం, 150 కేజీల వెండి ఆభరణాలు ఉండగా.. తనిఖీలలో దాదాపు 150 గ్రాముల బంగారు ఆభరణాలు అదృశ్యమైనట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. రెండు రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అధికారులు ఇంకా ఆలయ బ్యాంకు రికార్డులను తనిఖీ చేయావలసి ఉంది. ఏసీబీ తనిఖీల నేపథ్యంలో ఏం జరిగిందోనని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.