Blood Donation Camp: విద్యే కాదు.. సమాజ సేవ కూడా తెలుసు అంటున్న విద్యార్థులు - Blood Donation Camp By ACSR Medical Students
Blood Donation Camp By ACSR Medical Students: రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిసిన వైద్య విద్యార్థులు మా రూటే సపరేటు అంటున్నారు. విద్యే కాదు.. సమాజ సేవ కూడా మా దినచర్యలో భాగం అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ విద్యార్థులు. కాలేజీలో చదివే ప్రతి విద్యార్థి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి.. కాలేజీలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు.
నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైద్య కళాశాలలో మొత్తం 8 వందల మంది విద్యార్ధులు ఉన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక గ్రూపు విద్యార్ధులు రక్తదానం చేయడం జరుగుతుంది. సోమవారం మే డే సందర్భంగా వంద మంది విద్యార్ధులు రక్తదానం చేశారు. వెయ్యి పడకల ఆసుపత్రి అనుబంధంగా నడుస్తున్న వైద్య కళాశాలలో విద్యార్ధులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారనీ కళాశాల బోధకులు అంటున్నారు. బ్లడ్ బ్యాంక్లో రక్త కొరత లేకుండా మేము సైతం అంటూ వైద్య విద్యార్ధులు తరచు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారని వారు అంటున్నారు. కళాశాల బోధకులు వీరిని అభినందిస్తున్నారు.
రక్తం కృత్రిమంగా దొరకదు కాబట్టి విద్యార్థులు మే డే సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారని, తన విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు చాలా సంతోషంగా ఉందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మురళీ కృష్ణ అన్నారు.