APSRTC : "మాకు ఏసీ బస్సులో ప్రయాణిస్తుంటే నరకానికి వెళ్లినట్లు ఉంది" - ఆంధ్ర వార్తలు
AC Problems In APSRTC Indra busses : ఏసీ బస్సుల్లోని ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అదేంటి ఏసీ బస్సులో ఉక్కపోత ఏంటనే సందేహం మీకు కలగవచ్చు. కానీ, ఇక్కడ పరిస్థితి అలానే ఉంది. విజయవాడ నుంచి కర్నూల్‌కి వెళ్లే ఇంద్ర బస్సులోని ప్రయాణికులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీఎస్ఆర్టీసీలోని ఇంద్ర ప్రైవేటు ఏసీ బస్సులో ఏసీలు సరిగా పనిచేయటం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఎండ నుంచి తప్పించుకోవటానికి ఏసీ బస్సులో ప్రయాణం చేద్దామని వస్తే.. ఏసీలు పనిచేయక ఉక్కపోతతో ప్రయాణం ఇబ్బందిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తుంటే నరకం కనిపిస్తోందని ఆందోళన చెందారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందించటం లేదని ప్రయాణికులు వాపోయారు. సమస్య పరిష్కారం కోసం ప్రశ్నిస్తే సిబ్బంది ఒకరిపై ఒకరు సాకులు చెప్తు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. అవి కేవలం పేరుకే ఏసీ బస్సులని వారి దగ్గరి నుంచి ఏసీ పేరుతో డబ్బులు వసూలు చేశారని.. నాన్ ఏసీ బస్సులో ప్రయాణించినట్లు ఉందని ప్రయాణికులు అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.