Suicide Attempt: పొలంలో అక్రమంగా రహదారి వేస్తున్నారని.. యువకుడు ఆత్మహత్యాయత్నం - బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి
Suicide Attempt: నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో రహదారిపై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ డబ్బాతో వచ్చిన యువకుడు.. ఆ పెట్రోల్‌ను ఒంటిమీద పోసుకున్నాడు. తన దగ్గరికి ఎవరైనా వస్తే నిప్పంటించుకుంటానని బెదిరించడంతో పోలీసులు అప్రమత్తమై అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అండదండలతో తనకు చెందిన పొలంలో రహదారి వేస్తున్నారని నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొమ్మూరు కొట్టాల గ్రామానికి చెందిన రవికుమార్ అనే యువకుడు ఆరోపించాడు. అక్రమంగా వేస్తున్న ఈ రహదారిని నిలిపివేయాలని విన్నవించాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మేలు జరగలేదని వాపోయాడు. ఎవరూ న్యాయం చేయకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు రవికుమార్ తెలిపాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవికుమార్‌ను రెవెన్యూ అధికారుల వద్దకు తీసుకెళ్లి వారికి సమస్య వివరించారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి తన ప్రభావం చూపిస్తూ తన సహచరుల కోసం..ఆయనకు సంబంధించిన మైనింగ్ కోసం ముందే రోడ్డు వేసుకుంటున్నాడు. నా భూమిలోంచి కాలి తోవ పోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, నా భూమిలోంచి ట్రాక్టర్లు వెళ్లకుండా చూడండి. -రవికుమార్