నడుములోతు ప్రవాహం.. బైక్‌తో కొట్టుకుపోయిన వ్యక్తి.. అంతలోనే - వైరా కట్టలేరు నది
A person lost in the river : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీగా, అక్కడక్కడా మోస్తరు వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగాయి. అకాల వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వైరా కట్టలేరు నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌తో పాటు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వరద చుట్టుముట్టగా నడుములోతు ప్రవాహంలో బ్రిడ్జి పిల్లర్ పట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపాడు. స్థానికులు వెంటనే స్పందించడంతో క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు.
వీరులపాడు మండలం జయంతి ఎస్సీ కాలనీలో హెచ్ఎంగా పని చేస్తున్న ఎం. ఆదాం మధ్యాహ్నం పాఠశాలలో విధులు ముగించుకుని బైక్‌పై బయల్దేరాడు. నందిగామలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లే క్రమంలో పల్లంపల్లి వద్ద వైరా కట్టలేరు నదికి వస్తున్న వరదలో ద్విచక్ర వాహనంతో గల్లంతయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తాడు సహాయంతో అతనిని, ద్విచక్ర వాహనాన్ని బయటకు లాగారు. నది ప్రవాహం పెద్దగా లేకపోవడం, స్థానికులు సకాలంలో స్పందించడంతో ఆదాం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రధానోపాధ్యాయుడిని రక్షించిన వారిని గ్రామస్థులతో పాటు పలువురు అభినందించారు.