Old Lady Sarpanch: ఏ కార్యక్రమాలకు పిలవటం లేదు.. మహిళా సర్పంచ్ ఆవేదన - ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌పై ఆరోపణలు
Old Lady Sarpanch Crying : ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజవర్గంలో 75 సంవత్సరాల వృద్ధ సర్పంచ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామ సర్పంచ్‌గా తాను ఉండగా.. తన ప్రమేయం లేకుండానే గ్రామంలోని పనులు ఇతరులకు అప్పగిస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామపంచాయతి సర్పంచ్ ఆల చిన్న సైదమ్మ.. తనను ప్రోటోకాల్ ప్రకారం గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు పిలవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌పై ఆరోపణలు కురిపించారు. వారిద్దరూ సొంత నిధులతో లక్ష్మీపురం గ్రామంలో ఎన్ఎస్పీ కాలువ మరమ్మతుల పనులను ప్రారంభించి వెళ్లిపోయారని వివరించారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని సొంత పార్టీ సర్పంచ్‌నైనా తనను కాదని గ్రామంలో నిర్వహించే పనులను కూడా.. వైసీపీలోని ఇతర నాయకులకు అప్పగిస్తున్నారని వాపోయారు. పార్టీ కోసం ఎంతో కృషి చేశానని అంతేకాకుండా.. శాసనసభ ఎన్నికలో కూడా ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశామని తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే పులుసు పార్థసారథితో తమకు బంధుత్వం ఉందని ఆయనను ఓ కార్యక్రమానికి పిలిస్తే.. తనకు తెలియకుండా ఎలా పిలుస్తారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.