Girl Died: ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. కారు డోర్ లాక్ పడటంతో చిన్నారి మృతి - Car Doors Locked
Car Doors Locked: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాజులూరు మండలం కోలంకలో పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.. అందులోనే మరణించింది. కారు డోర్లు లాక్ అవడం.. దానిని ఎవరూ గమనించకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఎనిమిది సంవత్సరాల బాలిక అఖిలాండేశ్వరి.. తన ఇంటి సమీపంలో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కిందకి దిగుదామంటే డోర్ లాక్ తీయరాకపోవడంతో శ్వాస ఆడక ఇబ్బంది పడింది.
అందులోను కారు విండోస్ కూడా ఓపెన్లో లేకపోవడంతో గాలి సరిపోక చిన్నారి స్పృహ కోల్పోయింది. మధ్యాహ్నం అనగా కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. ఆడుకోవడానికి బయటికి వెళ్లిన కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం గాలించారు. చివరికి ఇంటి పక్కన కారులో కొన ఊపిరితో బాలికను చూసిన స్థానికులు వెంటనే యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా సంవత్సరం క్రితమే బాలిక తండ్రి మరణించగా.. బాలికతో పాటు, పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్మి పోషించుకుంటోంది. తాజాగా కూతురు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.