గంజాయి స్మగ్లర్ల దగ్గర పిస్టల్ కలకలం - ఓ బాలుడితో పాటు ఐదుగురు అరెస్టు - Marijuana Smugglers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 1:47 PM IST
420 KG Ganja Seized :అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో గంజాయి లేదని ఎన్ని సార్లు చెప్పినా, వారి మాటలు ఒట్టి మాటలే అనే విధంగా ప్రతీరోజు గంజాయి వాసన గుప్పుమంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గంజాయి గల్లీ గల్లీకి పరిచయం అయ్యింది. గంజాయితో పాటు, పోలీసులు నుంచి తమను కాపాడుకోవడం కోసం తుపాకులు సైతం వారు సేకరించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. తాజాగా స్మగ్లర్లు దగ్గర పిస్టల్ చూసి పోలీసులు నివ్వెర పోయారు. అనంతరం వారి నుంచి ఆ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
Pistol Near Marijuana Smugglers :ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు ఎన్నో రకాల ఎత్తులు పన్నుతున్నారు. తుపాకీ పట్టుకుని గ్యాంగ్‌స్టర్‌లా మారి గంజాయి ముఠాలు సంచరిస్తున్నాయి. అల్లూరి జిల్లా పెదబయలు మండలం కే.రూడకోట వద్ద ఎస్సై మనోజ్ కుమార్ తన సిబ్బందితో తనిఖీ చేయగా బొలెరో వ్యాన్‌లో 420 కిలోల భారీ గంజాయి పట్టుబడింది. వారి వద్ద పిస్టల్ ఉండటంతో పోలీసులు కంగుతున్నారు. ఆ గంజాయి గ్యాంగ్‌లో ఓ బాలుడు కూడా ఉండండం గమనార్హం. బాలుడితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరందరు ఆంధ్రా, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది.
420 కేజీల గంజాయితో పాటు ఒక బొలేరో వాహనం, రెండు మోటారు సైకిళ్లు, పిస్టల్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జి. మాడుగుల సీఐ రమేష్, పెదబయలు ఎస్సై మనోజ్‌కుమార్ తెలిపారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.8.40 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. స్మగ్లర్లు దగ్గర పిస్టల్ ఉండటంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. గంజాయి రవాణాతో పాటు పిస్టల్ ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.