3K Run in Vijayawada 2023: ఆంధ్ర క్రికెట్ ప్రతిష్ఠను పెంచే లక్ష్యంతో 3 కిలోమీటర్ల పరుగు
3K Run in Vijayawada 2023: ఆంధ్ర క్రికెట్ ప్రతిష్టను పెంచాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 3 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి ఈ పరుగు ప్రారంభించారు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షులు జి.గంగరాజు, ACA సభ్యులతో పాటు క్రీడాకారులు ఈ పరుగులో పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఆంధ్ర మన ఏపీఎల్(APL) పేరిట రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన హనుమ విహారి, అనూష, కేఎస్ భరత్, మహిళా క్రికెటర్లలో స్నేహ దీప్తి సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రేపు విశాఖ సాగర తీరంలో మెగా పరుగు కార్యక్రమం జరగనుందని.. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు.
APL Schedule Released: మరోవైపు రాష్ట్రంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) షెడ్యూల్ విడుదలైంది. ఈ లీగ్ ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనుంది. ఆ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ తలపడనున్నాయి. జట్లు ఆడే గేమ్‌లు కూడా విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో జరగనున్నాయి.