కదిరి బాలికల పాఠశాలలో 30 మందికి అస్వస్థత - శరీరంపై దద్దుర్లు, అలర్జీ - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 7:16 PM IST
30 Girls Fell ill in Kadiri Govt Girls High School:శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిలు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినుల శరీరంపై దద్దుర్లు రావడం, అలర్జీకి గురయ్యారు. సమస్యను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావడంతో వారు బాలికలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. తరగతి గది పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థులు ఆ చెత్తను తొలగించారు. చెత్తలోని క్రిమి కీటకాలు విద్యార్థినుల అలర్జీకి కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థినులతో చెత్త శుభ్రం చేయించడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడంపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి పెట్టాలని కందికుంట వెంకటప్రసాద్ సూచించారు.