Schoolgirls sick eating food: కలుషితాహారం తిని 27మంది విద్యార్థినులకు అస్వస్థత.. ఆరుగురి పరిస్థితి విషమం - గురుకులం
Schoolgirls get sick after eating contaminated food: విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడం వల్ల 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, వాంతులు కావడంతో మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వంగర ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది పాఠశాలకు చేరుకొని వైద్య సేవలు అందించారు. ఆరుగురు విద్యార్థినిల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. వంగర తహసీల్దార్ ఐజాక్, ఎంపీపీ సురేష్ ముఖర్జీ విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి... అసలే వర్షాకాలం.. నీరు కలుషితమయ్యే అవకాశాలు ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లలో పరిశుభ్రత తప్పనిసరి. ప్రత్యకించి విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజన పాత్రలు, పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వంట సిబ్బంది, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని వైద్యులు సూచిస్తున్నారు.