1998 DSC Candidates Agitation: రిలే నిరాహార దీక్షలకు సిద్దమైన 1998-డీఎస్సీ అభ్యర్ధులు - DSC relay fast from 11th
1998 డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 10, 11, 12 తేదీల్లో విజయవాడలో రిలే నిరహర దీక్షలు చేస్తున్నట్లు శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం 6,852 మంది విద్యార్హత పత్రాలను పరిశీలన చేసి 4,072 ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ మహిళల అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. విద్యార్హత పత్రాలు పరిశీలన చేసిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తే సామాజిక న్యాయం పాటించినట్లు అవుతుందని ప్రభుత్వానికి సూచించారు. 1998 డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హమీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము డీఎస్సీ ఉత్తీర్ణులైనా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్ధులు వాపోతున్నారు. ప్రభుత్వం విద్యార్హత పత్రాలు పరిశీలన చేస్తే తమకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్నామని.. కానీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని 1998 డీఎస్సీ అభ్యర్థి మెర్సీ సుహాసిని పేర్కొన్నారు.