108 వాహనంలో చెలరేగిన మంటలు.. సిబ్బంది పరుగులు.. ఎక్కడంటే..? - Prakasam district viral news
108 vehicles burnt in Prakasam district: ఆపదలో ఉన్న వారిని కాపాడే వాహనానికి ఆపద వచ్చింది. ప్రకాశం జిల్లా పామూరు మండలం రజాసాహెబ్ పేట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు 108 వాహనం అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. రెండు టుబాకో బార్నీలు పూర్తిగా దగ్ధమై, మరో నాలుగు బార్నీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. చంద్రశేఖరపురం మండలానికి చెందిన 108 వాహనం పామూరు మండలంలోని బోడవాడ గ్రామంలో ఉన్న వ్యాధిగ్రస్తులను వైద్యశాలకు తరలించేందుకు వెళుతున్న క్రమంలో రజాసాహెబ్ పేట గ్రామం వద్దకు రాగానే వాహనంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఇంజన్ నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనంలో ఉన్న సిబ్బంది వాహనాన్ని నిలిపి పరుగులు తీశారు.
ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా వాహనాన్ని చుట్టుముట్టి ఎక్కువ కావడంతో ప్రాణాలను కాపాడేందుకు వాహనంలో.. అమర్చి ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఫలితంగా చుట్టుపక్కల భారీ ఎత్తున మంటలు వ్యాపించి ఆస్తి నష్టం సంభవించింది. పక్కనే ఉన్న టుబాకో బార్నీలకు మంటలు వ్యాపించి రెండు టుబాకో బార్నీలు పూర్తిగా దగ్ధం కాదా మరో నాలుగు బార్నీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా 108 వాహనంలో మంటలు చెలరేగడం అందులో ఉన్న సిలిండర్లు పేలడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.