ఆంధ్రప్రదేశ్

andhra pradesh

R-5 zone

ETV Bharat / videos

R-5 zone issue farmers blocked: ఆర్-5 జోన్ పనులను అడ్డుకున్న రైతులు.. రాజధాని వైజాగ్‌లో భూములివ్వండి - Andhra Pradesh crime news

By

Published : May 12, 2023, 7:50 PM IST

Dondapadu farmers blocked the R-5 zone works: అమరావతి రాజధానిలో సీఆర్డీఏ అధికారులు చేపట్టిన ఆర్-5 జోన్ పనులను రైతులు అడ్డుకున్నారు. పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అధికారులు ఎట్లా జేసీబీలతో, పొక్లెయిన్లతో కంప చెట్లను తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ఆపాలని డిమాండ్ చేస్తూ.. అధికారులు ఏర్పాటు చేసిన గుడారాలను తొలగించేశారు. దీంతో అధికారులకు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సీఆర్డీఏ పనులను అడ్డుకున్న రైతులు.. తుళ్లూరు మండలం దొండపాడులో పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల ప్రాంతంలో సీఆర్డీఏ అధికారులు జేసీబీలు, పొక్లెయిన్లతో కంప చెట్లు తొలగించే పనులను ప్రారంభించారు. దీంతో దొండపాడు గ్రామస్థులు, అమరావతి రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన జేసీబీలను, పొక్లెయిన్లను, అధికారుల వాహనాలను వెనక్కు పంపించేశారు. దీంతో సీఆర్డీఏ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేయని ప్రభుత్వం.. ఇప్పుడు ఇళ్ల స్థలాల అభివృద్ధి పేరిట హడావుడి చేస్తోందని అధికారులను రైతులు నిలదీశారు. పేదల కోసం ఆర్‌-3 జోన్‌లో ఉన్న భూములు కాదని.. కొత్తగా ఆర్‌-5 జోన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్-3 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని రైతులు స్పష్టం చేశారు.

రాజధాని వైజాగ్ కదా.. అక్కడే భూములివ్వండి..పలువురు మీడియాతో రైతులు మాట్లాడుతూ..''పేద ప్రజలకు ప్రభుత్వం భూమి ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదు. కానీ, ఆర్-5 జోన్ ప్రణాళికను డిస్ట్రబ్ చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. పేదలకు ఆర్-3 జోన్‌లో భూములు కేటాయించండి తప్పులేదు. అంతేగానీ.. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల ప్రజలు.. వారి పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూముల్లో ఇస్తామంటే సరికాదు. సీఎం జగన్.. అక్టోబర్‌లో అసెంబ్లీని రద్దు చేయాలంటున్నాడు..డిసెంబర్‌లో ఎన్నికలంటున్నాడు. ఎప్పుడు ఇళ్లు కడతాడు..?. ఇదంతా మాయనాటకం తప్ప మరేమి కాదు. రైతులను ఈ ప్రభుత్వం ఏదో రకంగా నాశనం చేసి, లబ్ధి పొందాలని చూస్తోంది. ప్రజలు.. వాళ్ల తాత ముత్తాల తరం నుండి వచ్చిన ఆస్తుల్నీ రాజధాని కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే.. ఇవాళ వాటిని ధారాదత్తంగా పంచడానికి సీఎం జగన్ ఎవరు..? ఆయనకు ఏ హక్కు ఉంది..? రాష్ట్ర రాజధాని వైజాగ్ అంటున్నారు కదా.. అక్కడే పేద ప్రజలకు భూములు కేటాయించండి..ఇక్కడేందుకు..?'' అని వారు వ్యాఖ్యానించారు.

ఆర్‌-5 జోన్‌‌ను వెంటనే రద్దు చేయాలి..మరోవైపు రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ను నిరసిస్తూ.. అమరావతి రైతులు తుళ్లూరు మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా దీక్షా శిబిరం నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రగా చేపట్టారు. 'సెంటు భూమి వద్దు-టిడ్కో ఇల్లు ముద్దు' అంటూ రైతులు ముందుకుసాగారు. అనంతరం ఆర్‌-5 జోన్‌‌ను వెంటనే రద్దు చేయాలంటూ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details