సెలవిక: ఓ వీర సైనికా!
దేశ రక్షణ కోసం శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు యావత్ భారతావని అశ్రునయనాల నడుమ అంతిమ వీడ్కోలు పలికింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో... అమరజవాను అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్విగ్నభరితంగా సాగిన అంతిమయాత్రలో బరువెక్కిన గుండెలతో దారిపొడవునా నిల్చున్న స్థానికులు... కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహంపై పూలవర్షం కురిపించారు. భారత్ మతాకీ జై...!! జోహార్ సంతోష్‌బాబు...!! వీరుడా.... నీత్యాగం మరువం...!! అనే నినాదాలతో సూర్యాపేట నలుదిక్కులు పిక్కటిల్లాయి. ఆఖరిశ్వాస వరకూ దేశం కోసమే పరితపించి... రణక్షేత్రంలో నేలకొరిగిన భరతమాత వీరపుత్రుడికి.. యావత్ దేశం వీడ్కోలు పలికింది. వీరుడా.. మళ్లీ రా... అని ఆకాంక్షించింది.