మనం తీసుకునే ఆహారాల్లో పురుగుమందుల వాడకం అధికమవడమే కొవ్వు కరగకపోవడానికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ‘క్లోరిఫైరిఫాస్’ అనే పురుగుమందు చల్లిన ఆహార పంటలను తిన్నవారికి ఊబకాయం వస్తున్నట్లు గుర్తించారు. కెనడాలోని హామిల్టన్‌కు చెందిన 'మెక్‌మాస్టర్' విశ్వవిద్యాలయంలోని 'సెంటర్ ఫర్ మెటబాలిజమ్ ఒబేసిటీ అండ్ రిసెర్చ్' బృందం నిర్వహించిన పరిశోధనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇటీవలే ఈ పరిశోధన పత్రం ప్రఖ్యాత వైద్య పత్రిక 'నేచర్'లో ప్రచురితమైంది. మన దేశంలోనూ 'క్లోరిఫైరిఫాస్' మందును విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.
విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం
20 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు అధిక బరువు, ఊబకాయుల సంఖ్య పెరిగింది. ఎందుకీ వ్యత్యాసం అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధించగా.. ‘క్లోరిఫైరిఫాస్’ అనే పురుగుమందు ఊబకాయానికి కారణమవుతోందని గుర్తించారు. ఈ మందు ప్రజారోగ్యానికి ముప్పు తెస్తుందని కెనడాలో వాడకాన్ని ఎప్పుడో నిషేధించారు. మనదేశంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. గతేడాది మనదేశంలో మొత్తం 24,232.62 టన్నుల రసాయన మందులను పంటలపై చల్లగా అందులో క్లోరిఫైరిఫాస్ 1,094 టన్నులతో అగ్రస్థానంలో, దీని తరవాత 433 టన్నులతో ప్రెఫినోఫాస్ రెండో స్థానంలో ఉందని కేంద్ర మొక్కల పరిరక్షణ మండలి తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఏడాది(2019-20) దేశంలో 1,430.62 టన్నుల క్లోరిఫైరిఫాస్‌ను రైతులు పంటలపై చల్లారు. గత అక్టోబరులో హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్‌లోని వంకాయలను ప్రయోగశాలలో పరీక్షిస్తే వాటిపై క్లోరిఫైరిఫాస్ రసాయన అవశేషాలు ఉన్నాయి. అవి నిర్ణీత ప్రమాణాలకన్నా ఎక్కువగా ఉన్నట్లు జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐపీహెచ్‌ఎం) కేంద్ర వ్యవసాయశాఖకు పంపిన నివేదికలో తెలిపింది. ఇతర దేశాలు నిషేధించిన వాటిలో అత్యంత విషపూరితమైన 27 రకాల రసాయనాలను మనదేశంలో సైతం పంటలపై వాడకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తూ గతేడాది(2020) మేలో కేంద్రం ముసాయిదా విడుదల చేసింది. కానీ వాటి తయారీ కంపెనీల ఒత్తిడితో నిషేధాన్ని ఇంతవరకూ అమల్లోకి తీసుకురాలేదనే ఆరోపణ ఉంది. ఈ జాబితాలోని క్లోరిఫైరిఫాస్‌ను మనదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పంటలపై విచ్చలవిడిగా చల్లుతున్నారు.
దుష్ప్రభావం ఎలా?
ముదురు గోధుమరంగు(బ్రౌన్) కొవ్వు కణాల్లో కనిపించే 34 రకాల పురుగుమందు అవశేషాలపై కెనడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. మన శరీరంలో కేలరీలను కరిగించే గుణాన్ని బ్రౌన్ కొవ్వు కలిగి ఉంటుంది. ఎలుకలకు బాగా కొవ్వు ఉన్న ఆహారాన్ని ఇచ్చి క్లోరిఫైరిఫాస్ ప్రయోగించారు. దీనివల్ల బ్రౌన్ కొవ్వు కేలరీలను కరిగించే శక్తిని కోల్పోయింది. ఇలాగే మనుషుల్లోనూ జరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పర్యవసానంగా శరీరంలో సాధారణ కొవ్వు పెరిగి ఊబకాయం బారిన పడుతున్నట్లు కెనడా వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు.
మన కూరగాయలపై అవశేషాలు
ప్రజలకు విక్రయిస్తున్న కూరగాయలు, పండ్లను నమూనాగా తీసుకుని వాటిపై రసాయన అవశేషాలున్నాయా లేదా అనే పరీక్షలు నిత్యం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపీహెచ్‌ఎం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అధునాతన ప్రయోగశాలల్లో కేంద్ర వ్యవసాయశాఖ ఈ పరీక్షలు చేయిస్తోంది. ఉదాహరణకు ‘అసిఫేట్’ అనే రసాయన మందును వంగతోటలపై చల్లడానికి కేంద్రం అనుమతించలేదు. గుడిమల్కాపూర్‌లో అమ్ముతున్న వంకాయలపై ప్రతి కిలోకు 0.26 మిల్లీగ్రాముల అసిఫేట్ ఉన్నట్లు తేలింది. ఇలాగే ‘బైఫెనిత్రిన్’, టెబుకోనజోల్’ అనే మందులను సైతం కేంద్ర మొక్కల పరిరక్షణ మండలి సిఫార్సు చేయకున్నా.. వంకాయలపై చల్లడంతో వాటి అవశేషాలున్నట్లు ఎన్‌ఐపీహెచ్‌ఎం తెలిపింది.