ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకమని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై మంగళవారం వాడీవేడిగా చర్చ సాగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడ్డారు. బిల్లును మరోసారి పరిశీలించాలని మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు.
తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించడం... అతనికున్న చట్టబద్ధమైన హక్కుకు వ్యతిరేకమని విజయసాయి అభిప్రాయపడ్డారు. జైలుకు పంపడం వల్ల అతడు పునరాలోచించే అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. జైలుకెళ్లిన కాలంలో భార్యకు ఏ విధంగా జీవనభృతి అందించగలడని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ సామాజిక సమస్యన్న వైకాపా ఎంపీ... ఈ ప్రక్రియను నేరపూరితంగా మార్చడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదని స్పష్టం చేశారు.