Viveka murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని తెదేపా నేత బీటెక్ రవి చేసిన ఆరోపణలపై.. కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి మండిపడ్డారు. వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు బీటెక్ రవి యత్నిస్తున్నారని ఆరోపించారు. కనీసం గ్రామ సర్పంచ్‌గా కూడా గెలవని బీటెక్ రవి.. ఎంపీ అవినాశ్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
తెదేపా అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని.., అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డే వివేకా గుండెపోటుతో చనిపోయారని స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తుచేశారు. వివేకా కేసు తనకు చుట్టుకుంటుందన్న భయంతోనే ఆదినారాయణ రెడ్డి భాజపాలోకి వెళ్లారని ఆరోపించారు. తెదేపా నేతలు ప్రలోభాలకు గురిచేసి దస్తగిరి ద్వారా నలుగురు పేర్లు చెప్పించారన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉందో త్వరగా బహిర్గతం చేయాలని సీబీఐని డిమాండ్ చేశారు.
బీటెక్ రవి ఏమన్నారంటే..
వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్లో.. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లను ప్రస్తావించారని శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి తెలిపారు. అయితే.. శివశంకర్ రెడ్డిని మాత్రమే అరెస్టు చేసి.. మిగిలిన ముగ్గురిని అరెస్టు చేయకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడానికి.. తెరవెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లిన ప్రతిసారి అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకుంటున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు కడప పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇదీ చదవండి
YS Viveka Murder Case: వివేకా హత్య కేసు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్