కొండాపురం మండలం పి అనంతపురం గ్రామంలో మొత్తం 677 మంది నిర్వాసిత కుటుంబాలకు పరిహారం మంజూరు అయింది. ఈ ఏడాది జూలై 24వ తేదీన ఒక్కో పి.డి.ఎఫ్ కు 10 లక్షలు చొప్పున మొత్తం 67.7 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలో మొత్తం 265 మంది అనర్హులకు అక్రమంగా పరిహారం మంజూరు చేశారని జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదు చేసింది రామసుబ్బారెడ్డి వర్గీయుడు అయిన గురు ప్రతాప్ రెడ్డి అని.. సుధీర్ రెడ్డి వర్గం అతనిపై కోపంగా ఉంది. ఈ నెల 13వ తేదీన ప్రత్యేక ఉప కలెక్టర్ రోహిణి తహసీల్దార్లతో గ్రామానికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు.
అదే సమయంలో వైకాపాకు చెందిన ఇరువర్గాలు అక్కడికి చేరుకొని మాటమాట పెంచుకున్నారు. అప్పటికే తెచ్చుకున్న కత్తులు , ఇతర మారణాయుధాలతో గురు ప్రతాపరెడ్డిపై దాడి చేసి హత్యచేశారు. ఆ సమయంలో కేవలం ముగ్గురు పోలీసులు మాత్రమే ఉన్నారని రామసుబ్బారెడ్డి వర్గం ప్రజా ప్రతినిధుల సమక్షంలో వాపోయారు