Illegal Layouts : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగి పోతున్నాయి. అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తి, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడంతో పాటు, ఇష్టారాజ్యంగా లే అవుట్లను ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లే అవుట్‌లు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగానే అనధికార లే అవుట్‌లు ఉన్నట్లు అంచనా. వెంచర్ల ముసుగులో ప్రభుత్వ భూములను కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారనీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పనిలో పనిగా సెటిల్ మెంట్లు చేస్తూ అక్రమ సంపాదన కోసం పోటీపడి దాడులకు తెగబడుతున్న సందర్భాలు కడప నగరంలో వెలుగులోకి వస్తున్నాయి.
అధికార పార్టీ నేతల కొత్త అవతారం :ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎటు చూసినా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి వాటిలో వెంచర్లు వేసి రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను వెంచర్‌లలోకి కలిపేయడం లాంటివి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే వైఎస్సార్సీపీ నేతలే రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారమెత్తి భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు 400 వరకు అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలోని 200 అనధికార లే అవుట్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసి 60 లక్షల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేశారు. కానీ గుర్తించని వాటి సంఖ్య మూడు రెట్లు అధికంగానే ఉందనేది అనధికార సమాచారం. ఈ భూదందాలతోనే ఈ నెల 23న కడపలో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసుల రెడ్డిని దారుణంగా హత్య చేశారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.