Dalits land encroach in AP: సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామంలో దళితులు నాలుగు దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటుండగా.. వైఎస్సార్సీపీ నేతలు వారి నిమ్మ మొక్కల్నితొలగించారు. తమ పొలాన్ని బలవంతంగా లాక్కోవడానికి యత్నిస్తున్నారన్న బాధితులకు.... తెలుగుదేశం అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.
జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. మైదుకూరు మండలం జాండ్లవరంలో దళితుడైన సంబటూరు వెంకట సుబ్బయ్య తన పేరిట ఉన్న 5 ఎకరాల డీకేటీ పొలాన్ని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. మరణానంతరం ఆ భూమిలో ఆయన కుమారుడు రాజా నిమ్మ మొక్కలు నాటారు. ఈ పొలంపై కన్నేసిన స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు.. సోమవారం దౌర్జన్యంగా నిమ్మ మొక్కలు పీకేసి.. పూరిపాకకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.
'ఈ భూమీ మా తండ్రిగారి పేరు మీద ఉంది ఈ భూమి మెుత్తం ఐదు ఎకరాలు. మేము ఈ భూమిలో నిమ్మ మెుక్కలు పెట్టుకున్నాం. వైఎస్సార్సీపీ నేతలు మాపై నిన్న దాడిచేశారు. మేము పెట్టిన నిమ్మ మెుక్కలను మెుత్తం స్వాధీనం చేసుకున్నారు. మాపై దాడి చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు ట్రాక్టర్లో జనాలను తీసుకువచ్చారు. భూమిపై హక్కు లేదంటున్నారు. తూపల్లి రఘు, నర్సీంహా రెడ్డి, వెంకటయ్యలతోపాటు మెుత్తం 50 మంది వచ్చారు. మా తమ్ముడిపై దాడి చేసేందుకు వచ్చారు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.'- సంబటూరు రాజా, అనసూయ, దళిత రైతు