చెరువులు, కాలువలు పొంగి.. ఊళ్లను ముంచెత్తితే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని.. గండికొట్టి నీళ్లు విడిచి పెడుతుంటారు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా.. అధికారుల ముందస్తు అనుమతితోనే చర్యలు చేపడుతుంటారు. కానీ వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్నది ..పూర్తి విరుద్ధమైన వ్యవహారం.. ప్రజాప్రయోజనం కోసం ఇసుమంతైనా లేదు. కేవలం కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికార వైసీపీ నాయకుల బరితెగింపు తప్ప.
ఈ ప్రాంతం..కరువు కాటకాలకు నెలవుగా పేరొందిన రాయలసీమలోనిది. అదికూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా పులివెందులలో.. కొన్నేళ్లుగా నీటితో కళకళలాడుతున్న వేంపల్లె మండలం నాగూరు చెరువు ఇది. చుట్టుపక్కల నాలుగైదు ఊళ్లకు ఉన్న ఏకైక నీటివనరు ఈ చెరువే. అలాంటి చెరువును కాపాడటం మానేసి.. స్వార్థ ప్రయోజనాల కోసం పాలక వైసీపీ నాయకులే పొక్లెయిన్లతో గండి కొట్టించారు. చెరువులోని నీటిని ఇలా వృథా చేశారు. దీనికి పైనున్న అలవలపాడు చెరువు కట్టనూ.. మూడు రోజుల క్రితం ఇదే తరహాలో యంత్రాలతో బద్దలు కొట్టారు.
కడపలో వైసీపీ నేతల దుర్మార్గం.. మట్టి కోసం చెరువులకు గండి ఈ ఆగడాలకు కారణమేంటంటే.. సమీపంలోని గిడ్డంగివారిపల్లె వద్ద కడుతున్న రిజర్వాయర్‌కు బంక మట్టి అవసరమైంది. ఈ రెండు చెరువుల నుంచైతే.. బంకమట్టిని సులువుగా తరలించవచ్చని కాంట్రాక్టర్ భావించారు. అయితే.. ప్రస్తుతం రెండు చెరువులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఆ నీటిని వదిలితే తప్ప మట్టి తవ్వుకోవడం కష్టం. ఇంకేముంది.. అనుకున్నదే తడవుగా.. మండల వైసీపీ నాయకులతో కలిసి ఈ దురాగతానికి తెగబడ్డారు. యంత్రాలు తీసుకొచ్చి మరీ చెరువులకు గండ్లు కొట్టి నీటిని వదిలేశారు. చెరువుల్లో నిండుగా నీళ్లు ఉండటంతో వేసవిలో ఢోకా లేదనుకున్న స్థానిక రైతులు.. అధికార పార్టీ అరాచకంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
రెండు చెరువులకు గండి కొట్టిన విషయం తెలియగానే.. తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. వైసీపీ దురాగతాన్ని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దారుణంపై పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. నీళ్లు అమృతంతో సమానం. అలాంటి నీటిని కాపాడుకోవాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా చెరువులకు గండి కొట్టారన్న విషయం తెలిసిన వారంతా.. ఇదేం దుర్మార్గం అని ఆశ్చర్యపోతున్నారు.
ఇవీ చదవండి: