Kamalapuram constituency TDP leader murder plan: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని హత్య చేసేందుకు పన్నిన కుట్ర బయటపడింది. హత్య కోసం రెక్కీని నిర్వహించిన కిరాయి ముఠా నిఘాను జిల్లా పోలీసు అధికారులు గుర్తించి.. చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో కూడా రెండు మూడు కిరాయి హంతకుల ముఠాలను ఏర్పాటు చేసి, తన అనుచరులను హత్య చేసేందుకు భారీ కుట్ర చేశారని టీడీపీ నేత సాయినాథ్ శర్మ ఆరోపించారు.
కమలాపురం నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో సాయినాథ్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను వెల్లడించారు. కమలాపురం నియోజకవర్గంలో రాజకీయం మొదలైన రోజు నుంచి ఇప్పటివరకూ కిరాయి హంతకులతో చంపించాలన్న నీచ రాజకీయాలను ఎప్పుడు చూడలేదని సాయినాథ్ శర్మ అన్నారు. గతకొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ నేత స్వయంగా కిరాయి హంతకులతో బేరాలు కుదుర్చుకుంటున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికి పోలీసులు వారిపై ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఆ వివరాలను మీడియా ముందు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంతటి కుట్ర రాజకీయాలను చూస్తున్న అధికారులు.. ఇప్పటికైనా స్పందించి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎన్నికలకు సంవత్సర కాలం ముందే ఇలాంటి దాడులు, హత్యాయత్నాల ప్రణాళికలతో నియోజకవర్గం ప్రజలు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులపైన దాడులు జరపాలనుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని.. తన ప్రాణం ఉన్నంతవరకు తన అనుచరులపై కనీసం చిన్న ఈగ కూడా వాలనివ్వనని సాయినాథ్ శర్మ తేల్చి చెప్పారు. కిరాయి హంతకులను పట్టుకోవడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ, వారి సిబ్బందికి మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అదేవిధంగా వారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.