జగనన్న స్మార్ట్ సిటీకి భూములు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు: మడకలవారిపల్లె రైతులు Madakalavaripalle Dalit farmers fire on YSRCP leaders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్సార్ జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. పేదలు, బడుగు, బలహీనవర్గాలవారిని భయభ్రాంతులకు గురిచేస్తూ.. అక్రమంగా వారి భూములను లాగేసుకుంటున్నారు. గత 50ఏళ్లుగా గుట్టలు, మెట్టలుగా ఉన్న భూమిని చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటుండగా.. జగనన్న స్మార్ట్ సిటీకి భూముల్ని ఇవ్వాలంటూ దళిత రైతులను ఒత్తిడి చేస్తున్నారు. అయినా, రైతులు ఒప్పుకోకపోవడంతో పోలీసులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారంటూ..రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. తమను చంపేసి, తమ భూములను జగనన్న స్మార్ట్‌సిటీకి తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
జగనన్న స్మార్ట్‌సిటీకి భూములివ్వండి..పేదల భూములను జగనన్న స్మార్ట్ సిటీకి కేటాయించడంపై వైయస్సార్ జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లెంకు చెందిన దళిత రైతులు ఆందోళనకు దిగారు. స్మార్ట్ సిటీ పనులు జరగకుండా యంత్రాలను అడ్డుకున్నారు. దళితుల భూముల్ని అక్రమంగా లాగేసుకుంటున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన భూములను గత 50ఏళ్లుగా సాగు చేసుకుంటుండగా.. ఇప్పుడు ఆ భూముల్లో జగనన్న స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నారంటూ రైతులు వాపోయారు. తమ భూముల పక్కనే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు భూములు కొనుగోలు చేశాడని.. అతడి విలువను పెంచుకునేందుకు ఇక్కడ స్మార్ట్‌సిటీ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. భూములు ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారుల చేత తమను ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన చెందారు.
ప్రాణాలు పోయిన భూములివ్వం.. పలువురు రైతులు మాట్లాడుతూ..''ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1972వ సంవత్సరంలో వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లెలో ఉన్న 36 దళిత కుటుంబాలకు పక్కా గృహాల పేరుతో ఆనాడూ 58 ఎకరాల విస్తీర్ణం గల భూములను కేటాయించి మాకు అందజేశారు. అప్పటి నుంచి (దాదాపు 50ఏళ్లు) మా తాతలు, మా తండ్రులు, ప్రస్తుతం మేము ఈ భూములను మా అధీనంలోనే ఉంచుకొని.. సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాం. అప్పటినుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క ముఖ్యమంత్రి ఈ భూముల జోలికి రాలేదు. తాజాగా ఈజగన్ మోహన్ రెడ్డిప్రభుత్వం, వారి నాయకులు జగనన్న స్మార్ట్ సిటీని నిర్మిస్తున్నామంటూ మా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రెవిన్యూ అధికారులు.. మీ భూములకు మీకు ఎటువంటి హక్కు లేదని, మీకు మరోచోట భూముల్లో ఇళ్ల స్థలాలను కేటాయించి అందజేస్తామంటూ మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. పోలీసులతో బెదిరించి భూములను జగనన్న స్మార్ట్ సిటీకి అందజేయాలంటూ భయపెడుతున్నారు. మా ప్రాణాలు పోయిన ఫర్వాలేదు గానీ మా భూములను మాత్రం జగనన్న స్మార్ట్ సిటీకీ ఇచ్చేదిలేదు.'' అని రైతులు తేల్చిచెప్పారు. ఇప్పటికైనా సీఎం జగన్, ఉన్నతాధికారులు స్పందించి.. తమ భూములను తమకే ఉండనిచ్చేలా సహాయం చేయాలని మడకలవారిపల్లె దళిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మొదటి నుంచి మేమంతా వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నాము. 2000 సంవత్సరం నుంచి పార్టీ కోసం అనేక పోరాటాలు చేశాము. చివరికి మా భూములను జగనన్న స్మార్ట్ సిటీకి ఇచ్చేయాలంటూ కొందరు వైసీపీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా భూములు తీసుకుని మరోచోట భూములు ఇస్తామని చెప్తున్నారు. అవి మాకు వద్దు. మా భూములు మాకు కావాలి. జగనన్న స్మార్ట్ సిటీకి మా భూములు ఇవ్వము. సీఎం జగన్, ఉన్నతాధికారులు స్పందించి.. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.-దళిత రైతులు, మడకలవారిపల్లె