5 నెలల క్రితం మార్చి 15న కడప జిల్లా పులివెందులలో దారుణహత్యకు గురైన మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకుంది. సంఘటనా స్థలంలో ఆధారాలను తుడిచి వేసిన కారణంగా... కేసు విచారణలో కీలక ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రముఖుల హస్తం ఉంటుందని ముందు నుంచి పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు.
అనుమానితులకు నార్కో పరీక్షలు
పులివెందుల న్యాయస్థానం అనుమతితో నలుగురు అనుమానితులకు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు చేయిస్తున్నారు. వీరిలో వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డి, దిద్దేకుంటకు చెందిన రౌడీషీటర్ శేఖర్ రెడ్డి, వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నకు నార్కో పరీక్షలు చేస్తున్నారు.
కీలక సమాచారం సేకరణ
కడప ఎస్పీ అభిషేక్ మొహంతి.. గుజరాత్ వెళ్లి నార్కో పరీక్షల తీరును పరిశీలించినట్లు సమాచారం. రౌడీషీటర్ శేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల నుంచి పోలీసులు కీలక విషయాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజే పరమేశ్వర్ రెడ్డి... తనకు గుండెపోటని పులివెందుల ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుని... అనంతరం తిరుపతి ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అప్పుడే పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి హత్య జరిగిన విషయం తెలిసే ఉంటుందని భావించిన పోలీసులు... నార్కో పరీక్షలు చేయిస్తున్నారు. కేసును ఛేదిచేందుకు సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు, ప్రముఖుల వేలిముద్రలు కూడా సేకరించినట్లు సమాచారం.
పదిరోజుల్లో కేసు కొలిక్కి
పక్కా ఆధారాలతో హంతకులు ఎవరన్నది నిర్ధరించుకున్న తర్వాత నిందితులను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. వారం, పది రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. అయితే కేసుకు సంబంధించి ఏ విషయం బయటికి రాకుండా పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్తలు వహిస్తున్నారు. కేసులో ప్రముఖుల హస్తం ఉందని భావిస్తే... ముందుగా పులివెందులలో భారీగా పోలీసు బలగాలను మోహరించి అరెస్టులు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సిట్ గడువు ఈనెల 16వ తేదీతో ముగుస్తుంది. ఆలోపే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:
40 రోజులైనా... వివేకా హత్య కేసులో వీడని మిస్టరీ