ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

వివేకా హత్య కేసు
VIVEKA MURDER CASE

By

Published : Nov 29, 2022, 10:48 AM IST

Updated : Nov 30, 2022, 6:46 AM IST

10:42 November 29

హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

VIVEKA MURDER CASE TRANSFER TO TELANGANA: వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో న్యాయమైన విచారణ , స్వేచ్ఛాయుత దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం....హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానానికి బదిలీ చేసింది. పిటిషనర్ల వాదనను ఏకీభవించిన ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.

కేసు విచారణ తెలంగాణకు బదిలీ: ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయమైన విచారణ, స్వేచ్ఛగా జరిగే అవకాశం కనిపించనందున ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీలో విచారణ గాడితప్పే ప్రమాదం ఉందని హతుడి భార్య, కుమార్తె వ్యక్తం చేసిన అనుమానాలు హేతుబద్ధంగా కనిపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసు సీబీఐకి అప్పగించినా....రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు సాక్షులను బెదిరిస్తూ విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని....ఈ కేసు విచారణ తెలంగాణకు గానీ, మరేదైనా రాష్ట్రానికి గానీ బదిలీ చేయాల్సిందిగా వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు....కేసు విచారణను హైదారాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది.

సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా కేసులు: ఈ కేసులో ప్రధాన సాక్షులకు ప్రాణాపాయం ఉందని, కొందరు సాక్షులు ఇప్పటికే ప్రభావితమయ్యారని పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసులోని నిందితుడు, రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం ప్రభావం కారణంగా ఈ హత్యవెనుక ఉన్న కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తు న్యాయంగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని పిటిషనర్లు అభిప్రాయపడుతున్నారని సుప్రీం తెలిపింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక...రెండుసార్లు సిట్‌ మార్చినా...దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో జగన్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో హైకోర్టులో దాఖలుచేసిన వ్యాజ్యాన్ని సైతం ఉపసంహరించుకున్నారు. కానీ హైకోర్టు మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ ఛార్జిషీట్లు, అనుబంధ ఛార్జిషీట్లు దాఖలుచేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ఉన్న విస్తృత కుట్ర, సాక్ష్యాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా కేసులు నమోదుచేయగా, హైకోర్టు స్టే ఇచ్చింది. సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగించకుండా వారిని వేధించడానికే ఇలా తప్పుడు, నకిలీ కేసులు పెడుతున్నట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీన్ని బట్టి ప్రస్తుత దర్యాప్తు ఏమాత్రం స్వేచ్ఛగా కొనసాగే అవకాశం లేదని అనిపిస్తోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

ఛార్జిషీట్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర వెలుగులోకి:ఈ కేసులో ఓ సాక్షి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకరించి....ఆ తర్వాత మాటమార్చారని, దీనికి అతనిపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేసి ఉద్యోగంలోకి తీసుకోవడమే కారణమని కోర్టు అభిప్రాయపడింది. అలాగే గంగాధర్‌రెడ్డి అనే ముఖ్య సాక్షి కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకరించి.... ఆ తర్వాత సీబీఐ వేధిస్తోందని చెప్పడం, అనుమానాస్పదంగా మృతిచెందడం చూస్తుంటే ఈ కేసు తదుపరి దర్యాప్తు స్వేచ్ఛగా జరగకపోవచ్చన్న బాధితుల అనుమానాలను కొట్టిపారేయలేమని సుప్రీం కోర్టు తెలిపింది. ఛార్జిషీట్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చిందని....సాక్ష్యాల ధ్వంసంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు, వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు అవినాశ్‌ను, అతని అనుచరుడు శివశంకర్‌రెడ్డిని రక్షించాలని చూస్తున్నారని సునీత తరపు న్యాయవాది చేసిన వాదనలను సుప్రీం ప్రస్తావించింది.

సీబీఐ సిబ్బందిపై ఒత్తిడి: సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టారని...స్టే కోసం వారు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, ఫిర్యాదు పెండింగ్‌లో ఉండటంతో అధికారులు దర్యాప్తు నిలిపివేసి ఏపీనే వదిలిపెట్టి పోయారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ నేరంలో పాల్గొన్నవారిని రక్షించడానికి అధికారంలో ఉన్నవారు నిరంతరం ప్రయత్నిస్తున్నారని.... ఇందులో భాగంగా సాక్షులను, దర్యాప్తును, న్యాయప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సునీత తరఫు న్యాయవాది చేసిన వాదనలను సుప్రీంకోర్టు మరోసారి గుర్తుచేసింది. ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో ఇద్దరు ప్రధాన సాక్షులకు ఇప్పటికే పోలీసు భద్రత కల్పించారు. దీన్నిబట్టి సాక్షులను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాధారాలను చెరిపేయడానికి అనేక అవకాశాలున్నాయని... సీబీఐ సిబ్బందిపై ఒత్తిడి తేవడంతోపాటు,
వారిని బెదిరిస్తూ చివరకు తప్పుడు కేసులు పెడుతున్నందున తదుపరి దర్యాప్తు న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇన్ని అడ్డంకుల మధ్య ఈ కేసు దర్యాప్తు ఏపీలో సజావుగా సాగదంటూ....హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది.


ఇవీ చదవండి:

Last Updated : Nov 30, 2022, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details