మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ వెంకటేశ్‌ను అధికారులు విచారించారు.అలాగే ఓ మహిళను కూడా విచారించినట్లు సమాచారం. సాయంత్రం పులివెందులలోని వివేకా ఇంటిని ఆయన కుమార్తె సునీత సమక్షంలో అధికారులు పరిశీలించారు. సునీత నుంచి మరిన్ని వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
ముమ్మరంగా విచారణ...
వివేకా హత్య కేసు(ys viveka murder case)లో సీబీఐ(cbi) విచారణ ముమ్మరంగా సాగుతోంది. పులివెందుల వాసులు రవి, డ్రైవర్ గోవర్ధన్‌లను అధికారులు శనివారం విచారించారు. హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా తిరిగిన వాహనాల గురించి అధికారులు ఆరా తీశారు. ఆ రోజు దుండగులు అక్కడేమైనా నక్కి ఉన్నారా అనే కోణంలో విచారణ సాగించినట్లు సమాచారం. ఇక సీబీఐ అధికారులు అడిగిన మేరకు..రవాణా శాఖ సిబ్బంది కొన్ని వాహనాల వివరాలను వారికి అందజేశారు.
2019 మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్య(ys viveka murder) జరిగింది. 14వ తేదీ అర్ధరాత్రి వివేకా ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగిన అనుమానాస్పద వాహనాల వివరాలను రవాణ శాఖ అందించింది. హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా ఇన్నోవా వాహనం తిప్పిన యజమానులు అరికటవేముల రవి అలియాస్ మట్కారవితో పాటు డ్రైవర్ గోవర్ధన్‌ను సీబీఐ(cbi) ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో పాత్రధారులపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీబీఐ...సాక్ష్యాలు, ఆధారాల సేకరణలో పూర్తిగా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అసలైన హంతకులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి
Srivari Temple in Jammu: జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ