పట్టుదలతో ప్రయత్నిస్తే.. మహిళలు ఏ రంగంలోనైనా తమదైన ముద్ర వేయగలరని నిరూపిస్తోంది కడపకు చెందిన రాజనాల పూర్ణ. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఈమె తండ్రి గతంలో బాడీబిల్డర్. ఆయన ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే పవర్ లిఫ్టింగ్‌లో సాధన చేసింది. అనుకోని కారణాల వల్ల.. తొందరగా పెళ్లి చేసుకున్నప్పటికీ పూర్ణ పవర్‌లిఫ్టింగ్ మాత్రం వదల్లేదు.
భర్త శ్రీకాంత్ సహకారంతో పూర్ణ నిరంతరం సాధన చేస్తోంది. తన ప్రతిభతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అనేక పతకాలు కైవసం చేసుకుంది. ఈమె ఆసక్తిని గమనించిన కడప జిల్లా కమలాపురం CSSR-SRRM డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి స్పాన్సర్‌గా ముందుకు వచ్చారు. ఆయన ప్రోత్సాహంతో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది పూర్ణ.
2019 జనవరిలో కోల్‌కతాలో జరిగిన ఫెడరేషన్ కప్ పోటీల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. అదే ఏడాది కేరళలో జరిగిన జూనియర్ నేషనల్ పవర్ లిప్టింగ్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది. 2020లో హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ భారతదేశ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. 2021లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోటీల్లోనూ బంగారు పతకం కైవసం చేసుకుని.. అంతర్జాతీయ వేదికలపై వైపు అడుగులు వేసింది. 2021 డిసెంబరులో టర్కీలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు విభాగాల్లో పాల్గొంది. బంగారు పతకంతో పాటు స్ట్రాంగ్ ఉమెన్ అవార్డును కైవసం చేసుకుంది.