Murder: విద్యార్థిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది - badvel updates
19:19 June 18
ప్రేమోన్మాది ఘాతుకానికి మరో ఆడ కూతురు బలైంది. ప్రేమను నిరాకరించిందని డిగ్రీ చదువుతున్న విద్యార్థిని గొంతుకోసి హతమార్చాడో కిరాతకుడు. కన్నవారి కలల్ని కూలుస్తూ.. క్షణకాలంలోనే ఆమె ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లా బద్వేలులో జరిగింది.
ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు కత్తితో విద్యార్థిని గొంతులో పొడిచి ప్రాణం తీశాడు. కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది. అట్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన నారాయణ, పద్మల కుమారుడు చరణ్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చరణ్.. శిరీష వెంటపడగా నిరాకరించింది. ఇటీవల ఇంటికి వచ్చిన యువకుడు నాలుగు రోజుల క్రితం వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం శిరీష ఇంటికి వెళ్లాడు. విద్యార్థినితో మాట్లాడే క్రమంలో ఆమె గొంతుపై కత్తితో పొడిచాడు. అక్కడే కుప్ప కూలిపోగా కుటుంబ సభ్యులు బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శిరీష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. దాడి చేసిన చరణ్‌ను గ్రామస్థులు పట్టుకొని కొట్టారు. పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుత్రికి తరలించారు. విషద్రావణం తాగాడనే సందేహంతోనూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి