మొబైల్ చార్జర్ కోసం గొడవ..తర్వాత ఏం జరిగిందంటే..
కొందరు యువకులు కలిసి మరో యువకుడిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన సంఘటన కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు గ్రామంలో సంచలనం సృష్టించింది. మొబైల్ చార్జర్ కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మొబైల్ చార్జర్ కోసం వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలంలో చోటు చేసుకుంది. ఐదు మంది స్నేహితుల మధ్య ఈ రోజు ఉదయం జరిగిన గొడవలో కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఈ విషయం ఊరిలో పెద్దలకు తెలియడంతో అక్కడ నుంచి పరారయ్యారు. సాయంత్రం మధుసూదన్ అనే యువకుడు కొంతమంది యువకులతో కలిసి వారితో ఘర్షణకు దిగిన వ్యక్తి ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.